కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు

ఇరవై రెండేళ్ల మాలతి గాంగ్వార్ , 56 ఏళ్ల సుజాత భవే కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ఆప్తులను కోల్పోయారు. వైద్యరంగంలో పని చేసే వీరిద్దరి కుటుంబ సభ్యులూ కోవిడ్‌తో మరణించారు.

అయితే, కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వైద్య రంగ సిబ్బంది కుటుంబాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ ప్రస్తుత తీరు వారిని విస్మయపరుస్తోంది. కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో.. ప్రధాన మంత్రి మోదీ స్వయంగా వైద్య రంగ సిబ్బందికి, వారి కుటుంబాలకు జేజేలు పలికారు. ఆయనను అనుసరిస్తూ, సాధారణ పౌరులు కూడా వైద్య రంగ సిబ్బంది కోసం పళ్లాలపై చప్పుడు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ.. మిలిటరీ సిబ్బంది హెలికాఫ్టర్ల నుంచి పూలవాన కురిపిస్తూ కనిపించారు.

ఆ కుటుంబాలన్నీ ఇప్పుడెలా ఉన్నాయో తెలుసుకునేందుకు, బీబీసీ కొన్ని నెలల పాటు డాక్టర్లు, వైద్య సంస్థలు, మాజీ ప్రభుత్వ అధికారులు, ఉద్యమకారులు, క్షేత్ర స్థాయిలో వైద్యరంగ సిబ్బంది కుటుంబాలను కలిసింది. ఈ పరిశోధనలో భాగంగా వివరాలు సేకరించేందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తులు చేయడంతో పాటు ప్రభుత్వ పత్రాలనూ పరిశోధించింది. మేం ముందుగా దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలోనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి దగ్గర్లో ఉన్న ఒక గ్రామానికి వెళ్లాం. అక్కడే నేను మాలతిని కలిశాను.

ఆమె ఇంటి వరండాలో కూర్చుని, తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మ చనిపోయినప్పుడు వైద్య శాఖ సిబ్బంది సహా చాలా మంది నాకు కాల్ చేశారు. మా అమ్మ ఉద్యోగాన్ని చేయమని వారు నన్ను కోరారు. అప్పుడు ఇన్సూరెన్సు డబ్బు గురించి ప్రస్తావన వచ్చింది. అందరూ మద్దతు అందిస్తున్నట్లే మాట్లాడారు. అమ్మ చేసే ఉద్యోగంలో చేరేందుకు ఒక ఫార్మ్ నింపమంటే, అది కూడా నింపాను. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు” అని మాలతి చెప్పారు. మాలతి తల్లి శాంతి దేవి ఆశా హెల్త్ వర్కర్. ఆమె కోవిడ్ సోకి మరణించి నాలుగు నెలలు కావస్తోంది.

సహాయం చేయాలంటూ ఆ కుటుంబం చాలాసార్లు అధికారులను సంప్రదించింది. కానీ, ఇప్పటి వరకు ఆమెకు రావాల్సిన పరిహారం కానీ, ఆమె కూతురికి ఉద్యోగం కానీ రాలేదు. శాంతి 25 ఏళ్లు ఆ ఉద్యోగం చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. “మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. సహాయం కోసం చూస్తున్నాం” అని శాంతి సోదరుడు చెప్పారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు