ఆ ఒక్కడికీ హైద్రాబాద్ లో ఛాన్సిస్తాడా ? చారిత్రక అవసరం అంటే ఇదే – చంద్రబాబూ !

కష్టకాలంలో కళ్ల ముందు మెసిలే వాడే నాయకుడు. నమ్మినోళ్లకి గొంతుకై ఊరు కాని ఊర్లో అయినా రాష్ట్రం కాని రాష్ట్రంలో అయినా వినిపించే వాడే నాయకుడు. ఇది మన విధానం, ఇదీ మన భవిష్యత్ అని విడమరచి వివరించగల్గినోడు, గుండెల్లో ధైర్యం నింపేవాడే నాయకుడు. ఆంధ్రలోనే ఉంటూ అమరావతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు – మరి తెలంగాణ కోసం అలాంటి వాడొకణ్ని చూపిస్తాడా ? అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో నినదించేవాడిని ఒక్కడినైనా నిలబెడతాడా ?

నీడ్ ఆఫ్ ద అవర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ క్షణానికి ఏం కావాలో తేల్చుకోవాలి. ఆ క్షణం భవిష్యత్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయగల్గాలి. అదే నీడ్ ఆఫ్ ద అవర్. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. రాజకీయ వ్యూహాలు, సామాజిక సమీకరణాలు, పొత్తు లెక్కలు ఎన్నైనా పెట్టుకో ! కానీ నీ వాళ్లు నీ కోసం ఎదురు చూస్తున్నారు – నీ నిర్ణయం కోసం – నువ్వు నిలబెట్టే నాయకుల్లో దమ్మునోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు అనే విషయం కూడా గుర్తు పెట్టుకో ! – అంటోంది సగటు టీడీపీ సమర్థకుడి గుండె చప్పుడు. అవును. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ స్థాయిలో రీసౌండు వచ్చే గొంతుక ఒకటి కావాలి. రాజకీయం అయినా, సామాజికం అయినా, అన్నిటికీ మించి అక్కడున్న సీమాంధ్ర మూలవాసుల అవసరాల విషయంలో అయినా దశ దిశ మలుపు గెలుపు తేల్చేది తేల్చాల్సింది ఇలాంటి నాయకుడే ! మన లీడర్ విధానం ఇది, మన పార్టీ విధానం ఇది, మన ప్రభావం ఇది అని బల్లగుద్ది మరీ పలికించేవాడొకడు ఉండాలి టీడీపీకి. నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పార్టీ కేడర్, ఆంధ్రా జనం ఎదురు చూస్తున్నది ఇలాంటి వాడికోసమే. మరి ఇన్నాళ్లుగా ఉండిపోయిన లోటును భర్తీ చేసే సమయం ఇప్పుడు వచ్చింది. మరి పోటీ చేస్తున్న సీట్లలో ఇలాంటి పోటుగాడు ఒకణ్ని అయినా దింపుతాడా చంద్రబాబు !

అవసమో, అన్నగారి ఆశీస్సులో కానీ వాగ్ధాటితో జనం నుంచి ఊడిపడినట్టు కనిపించే నాయకుల్ని తయారు చేసే కార్ఖానా టీడీపీ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి ఫైండింగ్ ఒకటైనా ఉంటుందని ఆశ పడొచ్చా ? ఎదురు చూడొచ్చా ? కొత్త ముఖంలా కనిపించినా సరే, పార్టీ కోసం, అభిమానుల కోసం నేను సదా సుముఖం అనిపించేవాడు ఒకడైనా వస్తాడా ? టీడీపీ ముందు నుంచి ఓ మాటను పదేపదే వాడుతుంది. చారిత్రక అవసరం. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం మిగిల్చిన భావజాలాల్లో ఇదే కీలకం. కూకటి వేళ్లలో పెకలించాలనుకున్న చోట కూడా పచ్చగా చిగుళ్లు తొడుగుతోంది అంటే ఇలాంటి చారిత్రక అవసరమే కారణం. మరి ఇలాంటి సందర్భంలో – మన అన్నవాళ్ల కోసం దన్నుగా దమ్ముగా నిలబడే వాడు ఒకడికి అవకాశం ఇవ్వడం కూడా చారిత్రక అవసరమే ! మరి గుర్తిస్తాడా చంద్రబాబు ? నిర్ణయంతో నిరూపిస్తాడా ?

-->