అవ్వ మాటతో కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ ! ఇది చంద్రబాబు ఎమోషన్ !

రాజకీయ పార్టీని నడపడం అంటే సొంత వెహికిల్ ను డ్రైవ్ చేసినట్టు కాదు. ఇష్టమొచ్చినట్టు స్టీరింగ్ తిప్పడానికి లేదు. జనాభిప్రాయం అనే పట్టాల మీద రైలును నడపటం. అవును. రైలు జనం అభిప్రాయానికి తగ్గట్టుగానే వెళ్లాలి. అడ్డగోలు టర్నింగులు తిప్పుతానంటే తిరగబడుతుంది యవ్వారం. అందుకే చంద్రబాబు పదే పదే జనం అభిప్రాయం అలాగే అవ్వను కూడా అడిగాడు. ఆమె చెప్పిన సమాధానం విని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ చంద్రబాబుకి !

ప్రకాశం జిల్లా మార్టూరు దగ్గరలో చంద్రబాబు జనంలో తిరుగుతున్నాడు. అందరినీ కష్టాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఏమేమి చేసేది చెబుతున్నాడు. ఇంతలో ఓ అవ్వ ఎదురొచ్చి – నాబాబే అన్నట్టు మెటికలు విరిచింది. అమెను ఆప్యాయంగా చూస్తూ ఏం అవ్వా ఫించన్ వస్తోందా ? రేషన్ ఇస్తున్నారా ? అని అడిగాడు. అంతా వస్తోందయ్యా నీ దయ వల్ల అంది. నా దయేం లేదు. నీ హక్కు అది అన్నాడు. ఆ తర్వాత, ఏం అవ్వా నేను కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం తప్పా అని అడిగాడు. నువ్వు కష్టపడుతున్నావు బాబు. మా అబ్బాయి స్కూలు మాస్టారు. ఆయన నాకు అన్నీ చెబుతాడు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలుసు. బీజేపీ మనల్ని మోసం చేసింది. అలాంటి వాళ్లని ఎదిరించడానికి నువ్వు ఎవరితో కలిసినా తప్పు లేదు. నీతోనే మేం ఉంటాం. నువ్వు మా బాగు చూస్తూనే రాష్ట్రాన్ని కూడా నిలబెట్టాలి అనేసింది. అ మాట వినేసరికి చంద్రబాబులో మౌనం మూర్తీభవించింది. ఏంటా అని ఆయన ముఖం వైపు చూస్తే కళ్లల్లో సన్నని నీటి చార. ఆనంద బాష్పాలు అంటారే అవే ! అంటే నేను ఏం ఆశిస్తున్నానో అది జనానికి అర్థం అయ్యిందన్న సంతృప్తి కనిపించింది ఆ చూపుల్లో. అందుకే ఆ ఆనందం. ఇదే మాట మార్టూరు సభలో వేదిక మీద కూడా చెప్పాడు. నేను నిన్నటి నుంచి ఇప్పటి వరకూ నేరుగా 6 వేల మంది అభిప్రాయాలు తెలుసుకున్నా. దాదాపుగా అందరూ పాజిటివ్ గా చెప్పారు అన్నాడు.

తెలంగాణ ఎన్నికల కోసం కాదు. రాజకీయం కోసం కాదు. ప్రధాని అవ్వాలని అంతకన్నా కాదు. మన రాష్ట్రం కోసం, అమరావతి కోసం, ప్రత్యేక హోదా కోసం మాత్రమే నేను కాంగ్రెస్ తో కలిశా. అంతకు మించి మరో ధ్యాసే లేదు అని బాబు చెప్పినప్పుడు చప్పట్ల మోత మోగింది. అది హర్షామోదం. అంటే సంతోషంతో జనం కొట్టిన జేజేలు !

-->