ఈ బాబు ఆ బాబేనా ? సీనియర్ నాయకుడికి అలా వార్నింగ్ ఇచ్చాడేంటి ?

పిసికితే పిండికి కోపం. కాలిస్తే పెనానికి తాపం అన్నంత మొహమాటంగా ఉంటాయ్ సొంత పార్టీలో చంద్రబాబు రాజకీయాలు. అలాంటిది ఉన్నట్టుండి ఆయన చండ శాసనుడు అయిపోయాడు. ఒకనాటి మిత్రుడు, సీనియర్ నాయకుడి విషయంలో ఆయన రియాక్షన్ చూసి పార్టీ నేతలే షాకయ్యారు. అసలు ఈ బాబు ఆబాబేనా అనుకున్నారు. మళ్లీ ఆ వెంటనే, ఇదే దూకుడుతో ఉంటే ఇక తిరుగులేదు కొట్టేస్తాం అని ఉత్సాహపడ్డారు కూడా !

అవును. చంద్రబాబు రిపేర్లు మొదలు పెట్టాడు. రిపేర్లు చేస్తున్నప్పుడు కొన్ని పాత జాయింట్లు పీకాల్సి ఉంటుంది. కొత్త నట్లు బిగించాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి వెల్డింగులు, టింకరింగులు కూడా అవసరం పడతాయ్. అలాంటప్పుడు కొన్నిసార్లు కొందరికి నొప్పి అనిపించినా తప్పదని తేల్చేశాడు చంద్రబాబు. అదే సీన్ కనిపించింది ప్రకాశం జిల్లా సమీక్షలో. నియోజక వర్గాల ఇంఛార్జులతో సమావేశం అయ్యాడు బాబు. అక్కడే ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. నిజానికి ఆయన ఏ నియోజక వర్గానికీ ఇంఛార్జి కాదు. ఆయన నియోజక వర్గంలో ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చిన ఓ ఉత్సాహవంతుడైన నాయకుడు ఉన్నాడు. అతన్ని ఈయన ముందు నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటికే ఓసారి గట్టి వార్నింగ్ అయ్యింది. ఇంకోసారి హెచ్చరిక చేశాడు. అయినా సరే ఆయన ఇంఛార్జుల మీటింగులో కూర్చున్నాడు. మీరెందుకు మీకు బయర్దేరండి అనేశాడు అందరి ముందు. ఏం చేయాలో తెలియక ఆయన లేచి వెళ్లిపోయాడు. అలా అంటాడేంటి, నేను ఎమ్మెల్సీని. సీనియర్ ని అని బైటకొచ్చి రంకెలేశాడు. మరి ఇదే మాట లోపల అంటే సరిపోయేదని ఎవరో అన్నారు అక్కడికక్కడ. అంతే సౌండ్ లేదు. ఎందుకంటే చంద్రబాబు ఫామ్ లో ఉన్నప్పుడు ఎవడైనా బౌన్సర్ వేస్తే పడేది సిక్సరే. ఆ సంగతి అందరి కన్నా ఆయనకే బాగా తెలుసు. ముందు నుంచి అంతా చూశాడు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు.

అంటే చంద్రబాబు జిల్లాల వారీగా రిపేర్లు మొదలు పెట్టాడు. అదే ఊపులో గట్టిగా కట్టడిగా ఉంటడం కూడా మొదలు పెట్టాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ మాత్రం ఉండాలి. మొహమాట పడతాడనే వీక్ నెస్ ఇప్పటి వరకూ పెద్ద మైనస్. చంద్రబాబు కనుక దాన్ని దాటితే ఇక తిరుగేముంది ! అందుకే ఇప్పుడు అంత ఉత్సాహం !

-->