ఈ లెక్కలు చెప్పాల్సింది బుగ్గన ! ఏపీని చంద్రబాబు ముంచాడో తేల్చాడో తెలిసేది !

బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా ముందుకొచ్చి చెప్పిన సంగతులు భలే చిత్రంగా ఉన్నాయ్. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధే జరగలేదు అదో చీకటి అధ్యాయం అని, అసలు ఏపీ మైనస్ లలోకి పోయిందంటూ ఆయన వాదన తెర మీదకి తెచ్చారు. అయితే మరి ఏపీ పనితీరుకి టాప్ ర్యాంక్ ఎందుకు వచ్చినట్టు ? నీతి ఆయోగ్ అద్భుతం అని ప్రశంసించింది ఎందుకు ? ఇండస్ట్రీనే లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరసగా అగ్ర స్థానంలో ఎలా నిలబడింది ? కేంద్రం సాధించిన వృద్ధి రేటులో అర శాతం ఏకంగా ఆంధ్రా నుంచే వచ్చిందని మోడీ ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకు చెప్పినట్టు ? అంటే మోడీ ప్రభుత్వం చెప్పిందే తప్పా ? లేదంటే బుగ్గన చెప్పింది తప్పా ? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ?

పారిశ్రామిక వృద్ధి పదిశాతం ఉందని చంద్రబాబు ప్రభుత్వం అబద్ధం చెప్పింది. అసలు ఏపీలో పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు పెట్టలేదు అని బుగ్గన భలే తీర్మానించారు. అలా ఎలా చెబుతారూ అంటే ఆయన లాజిక్కు బయట పెట్టారు. నంబర్లు చూపించో, లేదంటే ఉత్పాదకత ఏముంది ఎక్కడుంది అనో లేదంటే పెట్టుబడులు రాలేదు అనో ఆధారాలతో వివరించడం కాదు సుమా ! పరిశ్రమలు వచ్చి ఉంటే కరెంటు వాడాలి కదా ! గత ఐదేళ్లలో కరెంటు వాడకం పెరగలేదనే వాదన తెర మీదకి తెచ్చారు. నోరు తెరిచిన వాళ్లు మూసుకోవడం మర్చిపోయారు చాలా సేపు. ఎంత స్కోర్ చేశారు అంటే రన్స్ మాత్రమే చెప్పాలి. కౌంట్ అయ్యేది అదొక్కటే ! డాట్ బాల్స్ ఇన్ని ఉన్నాయ్ అనడం అసంబద్ధం. అమాయకత్వం. బ్యాటింగ్ అంటేనే డాట్ బాల్స్ ఉండి తీరుతాయ్. డాట్ బాల్స్ గురించి మాత్రమే చెప్పి స్కోర్ చెప్పడం కుదరదు అంటే ఇక క్రికెట్ ఎందుకు ? బుగ్గన చెప్పింది కూడా ఇలాగే ఉంది. ఉదయ్ పధకం వచ్చాక, నేషనల్ గ్రిడ్ తెరిచాక విద్యుత్ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కింది. వృధాని అరికట్టి దేశంలోనే టాపర్ అయ్యింది. వరసగా మూడేళ్లు అవార్డులు కూడా సాధించింది. అంటే లభ్యత పెంచుకుంది. అలాంటప్పుడు పాత ఫిగర్స్ తెచ్చి ఇందులోంచి ఎక్కడ వాడురూ అనడం ఏంటి ? ఇండస్ట్రీ లెక్క కదా తీయాల్సింది ? అలా చెప్పకుండా మోపు మిగిలిపోయింది కాబట్టి పాలు అబద్ధం అంటే తల తిక్క వ్యవహారం కాదా ? వ్యవసాయం విషయంలోనూ అంతే ! అనుబంధ రంగాల్లో పెరిగితే సాగు పెరిగినట్టా అంటున్నారు బుగ్గన. సాగు అంటే వరి పొలంలో పండిన 45 బస్తాలు మాత్రమే అని కొత్త డిక్షనరీ రాయడం ఏంటి ? వ్యవసాయం అంటేనే ఫ్లోరీ కల్చర్, సెరి కల్చర్, ఆక్వా, హార్టీ కల్చర్ అన్నీ ఉంటాయ్. అవన్నీ తీసేసి మాకు నచ్చినవి మాత్రమే లెక్కేస్తామంటే ఇలాగే ఉంటుంది. ఇవన్నీ చూడబోతే ఏపీకి రావాల్సినవి సాధించడానికో, అవసరం అయినవి అడగడానికి ఓ ఆయుధంగానో శ్వేతపత్రం పెట్టినట్టు లేదు. చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి ఆయన ఏమీ చేయలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది ఆ కాసేపూ !

కాకపోతే ఒక్క మాట. చంద్రబాబును చంద్రబాబు స్టైల్లోనే ఫేస్ చేయాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు. అందుకే శ్వేత పత్రాలంటూ మొదలు పెట్టింది జగన్ ప్రభుత్వం. మామూలుగా అయితే ఇది జగన్ స్టైల్ కాదు. చూడబోతే దీర్ఘ కాలం ఇది కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీకి అప్పులు ఉన్నాయని, ఆర్థిక కష్టాలు ఉన్నాయని పదే పదే చెబుతూ హామీల విషయంలో తన దైన స్టైల్లో జగన్ అడుగు వేయాలని అనుకుంటున్నారు అని మాత్రం అర్థం అవుతోంది. ఆయనదైన స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. నడక మొదలైందే ఇప్పుడు కదా !

-->