కేసీఆర్ ఫామ్ హౌస్ బృందమే దిగుతోంది ! పొగ పెట్టేందుకు ప్లేస్ కూడా సిద్ధం !

నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలనుకుంటా కానీ నీకు మంచి జరగాలని నేనెందుకు కోరుకుంటానురా – అంటాడు పోసాని ఓ సినిమాలో ! ఇప్పుడు ఈ సన్యాసి తీరు చూస్తే అదే గుర్తొస్తోంది. జగన్ కోసం యాగం చేస్తాడట. రాజశ్యామల యాగం. ఆయన ఒంటి మీద శిలువ తీయడట. చేతిలో బైబిల్ వదలడట. ఆయన కోసం ఈయన యాగం చేసి ఏపీలో ప్రభుత్వం మారుస్తాడట ! చంద్రబాబును ఓడిస్తాడట ! ప్రయత్నం వినడానికే వినూత్నంగా లేదూ !

నేను బావుండాలని కోరుకోవడం ఆశ. ఎదుటి వాడు దెబ్బ తినిపోవాలనుకోవడం దురాశ, దుర్మార్గం. అలాంటి వాళ్లకి నిరాశే మిగులుతుంది. ఇప్పుడు సూక్తులు ఎందుకు అంటారా ? మరి టాపిక్ కూడా అలాంటిదే కదా ! తెలంగాణలో సక్సెస్ అయ్యిందట. అక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చాడట. దానికి ఆయన చేసిన యాగమే కారణం అట. ఆయన పెట్టిన ప్రసాదం, ఇచ్చిన తీర్థమే ఈవీఎంల మీద కూడా పనిచేసి టీఆర్ఎస్ ను గెలపించాయట. అది ఆయన బలీయమైన నమ్మకం. అందుకే ఏపీలో కూడా చేస్తా యాగం అంటున్నాడు. కాకపోతే కాస్త ప్యాట్రన్ మారుతోంది. అక్కడ అంటే కేసీఆర్ గెలవాలని చేశాడు. ఇక్కడ మాత్రం చంద్రబాబు ఓడిపోవాలని చేస్తాడట. ఏపీలో ప్రభుత్వం మారాలని చేస్తాడట. అందుకే ఇంత ప్రత్యేకంగా చెబుతున్నది. యాగం ఎవరికోసం, ఎవరి పేరనో వాళ్ల కోరిక తీరాలని చేయడం చూశాం కానీ ఇలా ఎవరో ఓడిపోవడాలని కోరుతూ చేయడం మాత్రం వినలేదు ఇప్పటి వరకూ. అసలు యాగం అంటేనే శుభకార్యం. శుభసూచికం. మరి అలాంటిదాన్ని కూడా మరొకరికి అశుభసూచికంగా మార్చాలనే ఐడియా ఉంది చూశారూ అదే అసలు పాయింట్. ధర్మం వర్థిల్లాలని, సుభిక్షంగా ఉండాలని, జనం కోసం నిలబడాలని సన్నాసులు సన్యాసులు అనుకునే రోజులు కాదు ఇవి. వాళ్లకి కూడా ఓ జెండా ఎజెండా వచ్చేశాయ్. ఇది ఖాయం. కళ్ల ముందు కనిపిస్తున్నది ఇదే.

ఇందులో కూడా కేసీఆర్ సెంటిమెంటే కనిపిస్తోంది. అదే అసలు పిటీ. నేరుగా జగన్ పేరు చెప్పి, జగన్ కోసం చేస్తున్నామని చెప్పే దమ్ము కూడా లేదు. పాపం జగన్ అందుక్కూడా పనికి రాడు అనమాట. కేసీఆర్ కి చేశాం కాబట్టి నీకూ చేస్తామంటున్నారు. జగన్ రోషపౌరుష ప్రతాపాలు కేవలం సెకండ్ హ్యాండ్ అని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలి ?

-->