వీళ్లిద్దరూ కొట్టుకుంటారా ?

రాజకీయంలో సానుభూతి ఒలుకుతోందంటే దానికో లెక్క ఉంటుంది. రాజకీయాల్లో పరామర్శలకు ఓ పాయింట్ ఉంటుంది. ఊరంతా ఊరుకున్నా కూడా ఆయనొక్కడే ప్రెస్ మీట్ పెట్టి జగన్ కు సానుభూతి ప్రకటించడానికి కూడా ఓ కారణం కచ్చితంగా ఉంది. అందుకే అంటున్నది వీళ్లద్దరూ కొట్టుకుంటారా – రాజకీయ బరిలో అని !

అవును. పాయింట్ పోటీ గురించే ! మాట్లాడుతున్నది చిత్తూరు జిల్లా గురించే ! ముందు మోహన్ బాబు ఫ్యామిలీ వైపు నుంచి వద్దాం. వైఎస్ ఫ్యామిలీతో విష్ణు సంబంధం కలుపుకొన్నాక బంధం బలపడింది. అంతకు ముందు నుంచే చంద్రబాబు దగ్గరకు రానివ్వకపోవడమో, లేదంటే మోహన్ బాబే దూరంగా ఉండటమో కూడా జరిగింది. అన్నీ కలిసి వైఎస్ కుటుంబానికి మోహన్ బాబు ఫ్యామిలీని దగ్గర చేశాయ్. గత ఎన్నికల్లోనే మంచు లక్ష్మి పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. అక్కడితోనే ఆగింది. పోటీ చేయలేదు. కానీ కొన్నాళ్లుగా మోహన్ బాబు చిన్న కొడుకు సినిమాల్లో సాధించింది చాలనుకొని నిర్ణయం తీసుకున్నాడనే మాట వినిపించింది. జనం కోరిక పై రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు అని కూడా ట్విట్టర్ తోపాటు సినీ ఇండస్ట్రీ అంతా అంది. సరిగ్గా ఆ తర్వాత వారం రోజులకే మోహన్ బాబు కోడి కత్తి మీద రియాక్ట్ అయ్యాడు. జగన్ కి మద్దతు ప్రకటించాడు. జగన్ ప్రాణాలకు హాని తలపెట్టే వాళ్లని క్షమించబోను అన్నాడు. అప్పటి వరకూ చాలా మందికి అనుమానాలున్నాయ్. ఈయన క్షమిస్తాడా లేదా అని. క్షమించను అని చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది. సంతోషం. అంటే ఎక్కడ పోటీ చేస్తాడు మనోజ్ ? మోహన్ బాబు ఫ్యామిలీ ముందు నుంచి చంద్రగిరిపై కన్నేసింది. సామాజిక ఈక్వేషన్స్ ను బట్టీ అదే లాకీ అని లెక్కేస్తోంది అంటున్నారు. అటు టీడీపీ వైపు నుంచి కూడా ఓ కొత్త టాక్ వినిపిస్తోంది.

కొన్నాళ్ల కిందట ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో నారా రోహిత్ తో చంద్రబాబు సీనియస్ గా మాట్లాడినట్టు చెబుతారు. సినిమాల్లోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఏం సాధించాం… ఏంటి పరిస్థితి… ఆల్టర్ నేటివ్ చూసుకుందామా…లేదంటే కంటిన్యూ అవుదామా అనే ఆలోచన చేశావా లేదా అని అడిగారు అంటారు దగ్గరి వాళ్లు. అందుకే చంద్రగిరి నుంచి అవసరం అయితే పోటీ చేయించే ఆలోచన కూడా ఉందని చెబుతారు కొందరు. మరి అదే నిజం అయితే అటు మనోజ్ కీ ఇటు రోహిత్ కీ పడటం ఖాయమేమో ! మరి ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ చెవిలో రెడ్డి సంగతి ఏంటి అంటారా ? నమ్మినోణ్ని వమ్ముచేయడమే కదా జగన్ సిద్ధాంతం. అదే జరిగింది అనుకోవాలి అప్పుడు ఇక !

-->