ఏపీపై కక్ష – తెలుగుపైనా విపక్ష పటేల్ విగ్రహంపై తెలుగు ఎక్కడ మోడీ ?

కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా ? మనసులో లేని ఐక్యత విగ్రహాలు పెడితే సాధ్యం అవుతుందా ? పటేల్ విగ్రహం సాక్షిగా తెలుగు భాషకూ, తెలుగు జాతికి జరిగిన అవమానం చూశాక ఆక్రోశంతో అడుగుతున్న ప్రశ్నలివి ! జీవీఎల్ లాంటోడు సంజాయిషీ ఇచ్చాకే మాట్లాడాలి ! రామ్మాధవ్ లాంటోళ్లు సమాధానం చెప్పిన తర్వాత రాజకీయాల ఊసెత్తాలి ! గుజరాత్ లో పెట్టిన పటేల్ మహా విగ్రహం మీద తెలుగు ఎందుకు లేదు ? పది భాషలకి పటేల్ విగ్రహంపై చోటు పెట్టిన కేంద్రం – తెలుగును మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేసింది ? దేశంలో అత్యధికులు మాట్లాడే మూడో భాష తెలుగు. మరి మన ఏపీ మీద కక్ష తెలుగు మీద చూపిస్తారా ? భాష విషయంలోనూ ఇంత విపక్ష ఉన్నోడు ఐక్యత ఏం సాధిస్తాడు ? రండి, మోడీని నిలదీద్దాం ! కడిగేద్దాం !

సఖ్యతకు అర్థం తెలీనోడు ఐక్యత పేరుతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది ! వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప సానుకూలత అంటే అర్థం కానోడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. దేశాన్ని ఏకం చేశాడు. సంస్థాన విలీనాధీశుడు అంటూ మూడేళ్లుగా ఊరూవాడా హోరెత్తించి ఏపీ లాంటి రాష్ట్రాల పొట్టకొట్టి మరీ మూడున్న వేల కోట్లు పోసి మహా విగ్రహం పెట్టాడు మోడీ. ఆరంభం కూడా అట్టహాసంగా చేశాడు. దేశవ్యాప్తంగా, మారు మూలల్లో కూడా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి దేశాన్ని గెల్చిన సుల్తాన్ లా ఆనందపడిపోయాడు. ఇంతా చేసి, తన సహజ సిద్ధమైన విద్వేషాన్ని మాత్రం వీడలేకపోయాడు. తెలుగు వాళ్లపైనా, తెలుగు జాతి పైనా, తెలుగు గడ్డపైనా వివక్షను బైటపెట్టుకున్నాడు. స్టాట్యూ ఆఫ్ యూనిటీపై తెలుగుకి చోటే పెట్టలేదు. మొత్తం పది భాషల్లో పటేల్ విగ్రహంపై – స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని రాశాడు. ఐక్యతకు ఇది చిహ్నమని చెప్పారు. ప్రకటించారు. అందులోనూ దక్షిణాదిపై బీజేపీకి ఉండే ద్వేషం బైటపడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ప్రాధాన్యం లేదు. తెలుగు లేదు. కన్నడం లేదు. తమిళంలో పేరు రాసినా ఆఖరి నిమిషంలో అచ్చుతప్పుని గుర్తించి చెరిపేశారు. చెరిపితే చెరిగేదా ? దాచాలనుకుంటే దాగేదా ? వివక్షపై తెలుగు జాతి విరుచుకుపడుతోంది అందుకే ! ఏం మోడీ, దేశానికి ప్రధానిగా వ్యవహరించలేనప్పుడు, పెద్దరికంతో ప్రవర్తించలేనప్పుడు ఐక్యత పేరుతో హంగామా దేనికి ? విశాల హృదయం ఉన్నట్టు ప్రచారాలు దేనికి ? ఛాతీ కొలతలు చెబుతావు కానీ జాతిని విడదీయాలనుకుంటావు. ఐక్యత ముసుగులో రాజకీయం కలుపుతావు కానీ అంతలోనే ఇలా అడ్డంగా దొరికిపోతావు ! ఇదేగా నీ స్థాయి ?

పటేల్ విగ్రహం పెడుతున్నది మెహర్బానీ కోసం అని దేశం మొత్తానికీ తెలియదా ? పటేల్ పై మోడీ అభిమానం ఏపాటిదో 20 ఏళ్లుగా గుజరాత్ చూడలేదా ? మరి ఎందుకు ప్రచారం ? ఏం సాధించాలనుకున్నాడు వేల కోట్లు పోసి ? దేశాన్ని ఏకతాటిపైకి పటేల్ తెచ్చాడు. ఇప్పుడు రాజకీయంగా నేను దేశవ్యాప్తంగా దండయాత్ర చేస్తున్నాను. ప్రతి మూలా కమలం విరబూయిస్తున్నాను అని చెప్పాలనుకున్నాడు. మూడున్నరేళ్ల నాడు విగ్రహం పెట్టాలన్న ఆలోచనకి ఈ మదమే మూలం. ఇప్పుడు మదం దిగుతోంది. పదవీ పోతోంది తొందర్లో ! ఇప్పుడు బుద్ధీ బైటపడింది. తెలుగు వాళ్లపైనా భాషపైనా మోడీ అసలు రంగు ఏంటో, మోడీ ఎంత దిగజారుడు స్వభావి అనేది ప్రపంచం మొత్తం చూస్తోంది. తెలుగు గడ్డ తనపై కత్తి కట్టిందని అర్థమయ్యో, తెలుగు బిడ్డ తనని మట్టి కరిపిస్తాడని రూఢీ అయిపోయిందో కానీ మోడీ తన మనసులో ఉన్న ద్వేషాన్ని ఇలా చెప్పేశాడు. మరి తెలుగు పౌరుషమా – మరోసారి నీ ఆక్రోశం రుచి చూపించు ! ఐక్యత ముసుగులో విగ్రహ ఆటలాడుతున్న మోడీకి నీ సత్తా సవిచూపించు ! ఆత్మాభిమానంతో అదరగొట్టు ! నీ భాషకీ నీ నేలకీ నీ జాతికీ విలువ ఇవ్వని కాషాయాన్ని దేశం నుంచే తరిమి కొట్టు. తెలుగు దేశమా – రా కదలి రా !

-->