చంద్రబాబు – ద మ్యాన్ ఆఫ్ యూనిటీ ! తెలుగు దేశమే కాదు దేశమూ చెప్పింది !

రాజకీయం కోసం ఇనప విగ్రహాన్ని ఆవిష్కరించి ఢిల్లీ తిరిగి వచ్చిన మోడీకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ కనిపించింది. కొట్టుకు చచ్చే విపక్షాలు ఒక్కటిగా నిలబడ్డాయ్. వాటి ముందు ఓ నాయకుడు మహోన్నతంగా, స్థిరంగా నిలబడ్డాడు. ఆ నాయకుణ్ని చూసి ఉలిక్కిపడ్డాడు మోడీ ! బాగానే తెలుసు. చంద్రబాబు నాయుడు. ద మ్యాన్ ఆఫ్ యూనిటీ ! దేశం అతన్నిప్పుడు నాయుడు అని కాదు నాయకుడు అని పిలుస్తోంది ! అవును. రాజధాని లేని రాష్ట్రాన్ని దేశ రాజకీయానికి రాజధాని చేశాడు చంద్రబాబు ‍!

మోడీ కొత్త కొత్తవన్నీ ఆవిష్కరిస్తుంటాడు ! పెట్రోల్ డీజిల్ ను ఒకే ధరకి తెచ్చేయడం లాంటివి ఆయన ఆవిష్కరించిన ఘనతల్లో కొన్ని ! ఇలాంటి ఆవిష్కణల దెబ్బతో అల్లాడిపోతోంది దేశం. పై పెచ్చు నాకు పోటీ ఎవరు ? ఇటు వైపు నేను – అటు పక్కన ఎవరు అంటున్నాడు ఓల్డ్ ట్రంకాల్ మాట్లాడుతున్నట్టు ! సెల్ ఫోన్ రాక ముందు అలాగే మాట్లాడేవాళ్లు లెండి ! ఆవిష్కరణలకీ అలాంటి ప్రశ్నలకి కలిపి గొట్టే సమాధానం చెప్పాడు చంద్రబాబు. అటు పక్కన నువ్వుంటే – దేశం వెంట నేనుంటా అంటూ తెలుగు దేశాన్ని రంగంలోకి దించాడు. ప్రాంతీయ పార్టీలను కలిపాడు. కొత్త కూటమి తయారు చేశాడు. మోడీకి కేవలం రథం అయితే ఇది యుద్ధ ట్యాంకు. సరుకు, సరంజామాతోపాటు ప్రజాభిమానం, దేశం ఆశీస్సులు కూడా ఉన్నది ఇటే ! అందుకే తరుగు అటు మొగ్గు ఇటు కనిపిస్తోంది. చంద్రబాబు వేసిన తొలి అడుగే సూపర్ సక్సెస్ అంటూ నేషనల్ మీడియా ప్రత్యేకంగా రాయడానికి కారణం అదే ! దేశం సంక్షోభంలో ఉన్న ప్రతీసారీ తెలుగు దేశం భుజం కాస్తుంది అని నిరూపించిన సందర్భం ఇది. వ్యవస్థలన్నీ విఫలమైన చోట అవస్థలే భవిష్యత్ కి బహుమానం అవుతాయ్. అలాంటి పరిస్థితిని మార్చేందుకు, చేయితో చేయి కలుపుదాం, దేశాన్ని కొత్త గమ్యం వైపు మలుపుదామంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు చిచ్చుబుడ్డి లాంటి సంచలనం కాదు. వెలిచి గెలిచి నిలిచే వెలుగు. రాజకీయ నీలాకాశంలో ధ్రువతార.

సాహసి మాత్రమే కాదు సాధకుడు కూడా ! జాతీయపార్టీలు మెజారిటీ సాధించలేని పరిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ మొలకెత్తింది ఇలాంటి ఆలోచనతోనే ! ‍ఒక్క ఓటు లేక కుప్పకూలి అల్లాడుతున్నప్పుడు కూటమికి స్థిరత్వం తెచ్చిందీ ఇదే వ్యూహం. ఇప్పుడు నియంత చెరలో అల్లాడుతున్న దేశానికి కొత్త ఉదయం చూపిస్తున్నదీ ఇదే చాణక్యం. అవును. చంద్రబాబే ! చారిత్రక సందర్భం తలెత్తిన ప్రతీసారీ పక్షాలన్నిటినీ ఏకం చేసే సారధి, దేశానికి కొత్త గమ్యాన్ని చూపే వారధీ చంద్రబాబే ! అందుకే చంద్రబాబునాయుడే నాయకుడు !

-->