మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా? డిగ్రీతో సంబంధం లేకుండా, భావోద్వేగాలతో నిండిన గుండెతో చిరంజీవి ఆసుపత్రిలోకి అడుగుపెడతారు. అక్కడ కోమాలో ఉన్న ఓ బాలుడిని ‘‘రోగి’’ అని వైద్యులు సంబోధించడాన్ని ఆయన తట్టుకోలేకపోతారు. ఆ పిల్లాడికి ఎవరు ఎలా పిలుస్తున్నారో తెలియనప్పటికీ ఆయన్ను ఓ రోగిలా మాత్రం చూడకూడదని చిరంజీవి అంటారు.

ఇప్పుడు రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌కు వద్దాం. ఏడాదికిపైగా కరోనావైరస్‌తో వైద్యులు పోరాడుతున్నారు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి కళ్లముందే ఎందరో రోగులు మరణిస్తున్నారు. ఆ మృతుల ఫోటోలు, వీడియోలను ఒకసారి చూసి మనం స్క్రోల్ చేసేస్తున్నాం. మరి వైద్యుల పరిస్థితి ఏమిటి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు.. మరణాలను చూస్తున్న, మరణం అంచులవరకు వెళ్లినవారికి సేవలందిస్తున్న వైద్యుల్ని కేవలం ‘‘వారియర్లు’’ అంటే సరిపోతుందా?

ఐసీయూ వార్డుల్లో ప్రాణాలతో పోరాడుతున్న కోవిడ్ బాధితులకు నిత్యం చికిత్స అందించడం ఎంత కష్టం. దీన్ని అందరికీ తెలియజేసేలా చేసేందుకు ఐసీయూ డైరీ పేరుతో ఓ సిరీస్‌ను బీబీసీ తెలుగు మీకు అందిస్తోంది. ఇలా ఐసీయూల్లో సేవలందిస్తున్న వారిలో ఒకరైన డాక్టర్ దీప్‌శిఖా ఘోష్ అనుభవాలతో ఈ సిరీస్ మొదలవుతోంది. కోవిడ్ బాధితుల్ని వైద్యులు కేవలం రోగులుగా మాత్రమే చూడటం లేదని వీటి ద్వారా మనకు అర్థమవుతుంది. మరణించిన కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు ‘‘సారీ’’అని చెప్పాల్సి వచ్చినప్పుడు.. వైద్యులు తమ మనసుకు కూడా సారీ చెప్పుకొంటారు. ఎందుకంటే వారి మనసును పశ్చాత్తాపం వెంటాడుతుంది.

కొన్ని వారాల క్రితం ఒక వృద్ధుడు తీవ్ర జ్వరంతో, పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలతో ఆసుపత్రిలో చేరారు. ఆ రోజు రాత్రి ఐసీయూలో చేరేసరికి ఆయన చాలా అలిసిపోయి ఉన్నారు. ఆయనను నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. కానీ, ఆయనకు మాస్క్ ఎందుకు పెట్టుకోవాలో అర్ధం కాలేదు. ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరని అర్ధమైంది. దాంతో, ఆయన కుటుంబానికి ఫోన్ చేసి ఆయన మాస్క్ పెట్టుకోవడం లేదనే విషయాన్ని చెప్పాను. ఆయన భార్యకు కాల్ చేసి మొత్తం పరిస్థితిని వివరించాను. ఆయన మాస్క్ తొలగించకుండా ఉండేందుకు మేము బలవంతం చేయవలసి వస్తుందని ఆమెతో చెప్పాను. ఆమె విషాదంతో ఆయన ఆక్సిజన్ స్థాయి మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఆయన ఆక్సిజన్ స్థాయి సాధారణ స్థితికి చేరే వరకు ఆయన బెడ్ పక్కనే ఉంటానని చెప్పాను. నా మాటలు విన్న తర్వాత ఆమె ఫోన్ పెట్టేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి