స్మార్ట్ హోమ్: ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతటదే వెలుగుతుంది

స్విచ్ వేయకుండానే మన కదలికను బట్టి లైట్ దానంతట అదే వెలిగితే..

పొద్దున్నే అలారం మోగగానే కిచెన్‍లోని కాఫీ మెషీన్ దానంతట అదే మనకోసం కాఫీ తయారు చేస్తే.. కాఫీ మెషీన్‍ తన పని పూర్తి చేసి, ‘టోస్ట్ చేయ్’ అని పక్కనే ఉన్న టోస్టర్‍కి పని చెబితే.. ఇంట్లోని ఫ్రిడ్జిలో ఏమేం సరుకులు ఉన్నాయో, వాటి ఎక్స్‌పైరీ డేట్లతో సహా సూపర్ మార్కెట్‍ నుంచే చూసుకునే అవకాశం ఉంటే.. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా, మాయా లోకంలా అనిపిస్తోంది కదా. ఇవేవో సరదా ఊహలు కావు. స్మార్ట్ హోమ్, హోమ్ ఆటోమేషన్‌తో ఇవ్వన్నీ సాధ్యమే.

ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఆటోమాటిక్‍గా కంట్రోల్ చేయడమే ‘హోమ్ ఆటోమేషన్’. మన ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జిలు, గీజర్లు, బల్బులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని మనం కంట్రోల్ చేస్తూనే ఉన్నాము. వాటి ఆన్/ఆఫ్ స్విచ్చులు మన ఆధీనంలోనే ఉంటాయి. మరి ఇప్పుడు కొత్తగా ‘స్మార్ట్ హోమ్’ ఏంటి? ‘హోమ్ ఆటోమేషన్’ ఏంటి? వాటిని ఆటోమాటిక్‍గా కంట్రోల్ చేయడమంటే ఏంటి? ఇదివరకు ఈ పరికరాలు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి మనం అవి ఉన్న చోటుకు వెళ్లాలి. మనం చేయకపోతే పని పూర్తి కాదు.

అలా కాకుండా పరికరాలు వాటంతటవే కంట్రోల్ చేసుకోగలిగినా (self-regulation, auto-operation), లేక మనం ముందుగా ఇచ్చిన సూచనలు బట్టి పని చేయగలిగినా (logic driven operation) అవి స్మార్ట్ అనిపించుకుంటాయి. అలాంటి డివైజులున్న ఇల్లు ‘స్మార్ట్ హోమ్’ అవుతుంది. ఒక పరికరం ఇంకో పరికరానికి సూచనలు ఇవ్వగలిగితే (inter-device communication) అప్పుడది ‘హోమ్ ఆటోమేషన్’ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు సాధ్యం కాని ఈ స్మార్ట్ హోమ్ ఇప్పుడెలా సాధ్యమవుతోందన్న ప్రశ్నకి సమాధానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’.

గత రెండు మూడు దశాబ్దాలుగా మన ఇళ్లల్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటర్నెట్‍కు కనెక్ట్ కాలేవు. వాటిలో ఆ వెసులుబాటు లేదు. ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ సాయంతో మామూలు వస్తువుల్లో కూడా సెన్సర్లు, సాఫ్ట్‌వేర్‌ లాంటివి పెట్టి ఆ వస్తువు నుంచి డేటా పంపించడానికి(సెండ్), స్వీకరించడానికి (రిసీవ్) వీలు కల్పించొచ్చు. వాటిని ఓ మోస్తరు కంప్యుటేషనల్ డివైజుల్లా పని చేయించవచ్చు.

ఇలా వస్తువులన్నింటినీ ఇంటర్నెట్‍కు కనెక్ట్ చేసి, నెట్‌వర్క్‌లో భాగం చేయడమే ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్- ఐఓటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నెట్‍కు కనెక్ట్ అయి సమాచారాన్ని అటూ ఇటూ పంపడానికి పెద్ద పెద్ద కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లే అవసరం లేదు. మామూలుగా మనం వాడే వాలెట్, పర్సులో కూడా సెన్సర్ ఉంటే, వేలి ముద్రలను ఫీడ్ చేయవచ్చు. మన చేయి తప్ప వేరెవరి చేయి తగిలినా ఫోన్‍లో అలారం మోగేలా కోడ్ రాసుకోవచ్చు. పర్స్ ఎక్కడున్నా దాని లొకేషన్ కో-ఆర్డినేట్స్ మన ఫోన్‍లో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. చూడ్డానికి మామూలుగా లెదర్‍తోనో, బట్టతోనో చేసినట్టు కనిపించే పర్సును కూడా కంప్యుటేషన్ చేయగలిగే మెషీన్‍గా మార్చేస్తుంది ఐఓటీ.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు