Home ఇతర వార్తలు మైక్రోవేవ్‌లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా? అందులో వాడే ప్లాస్టిక్ వస్తువులతో కలిగే ప్రమాదమేంటి

మైక్రోవేవ్‌లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా? అందులో వాడే ప్లాస్టిక్ వస్తువులతో కలిగే ప్రమాదమేంటి

0
మైక్రోవేవ్‌లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా? అందులో వాడే ప్లాస్టిక్ వస్తువులతో కలిగే ప్రమాదమేంటి

మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేసుకోవడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. కానీ దానికోసం ప్లాస్టిక్ వాడడంతోనే సమస్య అంతా.

వంట రానివారికి, చేసుకునే టైం లేనివారికి మైక్రోవేవ్ వంటింటి నేస్తం అయింది. కానీ వంటల్లో చేయి తిరిగిన నలభీములు మాత్రం మైక్రోవేవ్ వాడకాన్ని వ్యతిరేకిస్తున్నారు. వంట చెయ్యడం ఒక కళ అనీ, మైక్రోవేవ్ ఆ కళని కనుమరుగయేలా చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఫాస్ట్‌ఫుడ్ తయారీలో మైక్రోవేవ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానీ, మెల్లిగా, నిదానంగా వండుకున్న ఆహారం ద్వారా వచ్చే లాభాలు ఈ తరానికి అందడం లేదన్నది వారి వాదన. సరిగ్గా ఉపయోగిస్తే మైక్రోవేవ్ రేడియేషన్ ప్రమాదకరం కాదని, దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. అయితే, మైక్రోవేవ్‌లో వండటం వల్ల ఆహారంలో పోషక విలువలు నశిస్తాయని, ప్లాస్టిక్ గిన్నెలు వాడకం వలన శరీరంలోని హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుందనే భయాలు లేకపోలేదు.

మైక్రోవేవ్‌లో వండటం వల్ల కూరగాయల్లో ఉండే ముఖ్యమైన పోషక విలువలు నశిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా బ్రోకలీలాంటి కూరగాయలను మైక్రోవేవ్‌లో వండితే వాటిలో ఉండే కొన్ని రకాల ఫ్లేవనాయిడ్లు 97% వరకూ తగ్గిపోతాయని, పొయ్యి మీద ఉడికించడం వల్ల జరిగే నష్టంకన్నా ఇది ఎక్కువ శాతమని తేలింది. ఈ ఫ్లేవనాయిడ్లు కడుపులో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి. అయితే, తక్కువ సమయంలో వండితే (ఒక నిముషం పాటు మైక్రోవేవ్‌లో ఉడికించారు) బ్రోకలీలో ఎలాంటి పోషక విలువల నష్టం జరగలేదని 2019లో వచ్చిన ఒక పరిశోధనలో తేలింది.

నిజానికి, ఆవిరిలో ఉడికించడం, మైక్రోవేవ్‌లో వండడం వలన ఆహారంలో చాలా రకల ఫ్లేవనాయిడ్లు పెరుగుతాయని, ఇవి గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయని ఈ పరిశోధన చేసిన వాళ్లు చెప్పారు. కొన్ని కండీషన్ల ప్రకారం వండితే ఆవిరి మీద వండడంకన్నా కూడా మైక్రోవేవ్‌లో వండడంవల్ల ఫ్లేవనాయిడ్లు పెరిగాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఉడికించడానికి ఎక్కువ నీరు వాడితే మాత్రం ఫ్లేవనాయిడ్ల శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

మైక్రోవేవ్ కుకింగ్‌లో ఫ్లేవనాయిడ్ల శాతం ఎందుకు పెరుగుతుందో వివరించడానికి కచ్చితమైన సాధనాలేమీ లేవని అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన బెల్ట్స్‌విల్ హ్యూమన్ న్యూట్రిషన్ రిసెర్చ్ సెంటర్‌లో ప్రధాన పరిశోధకులు షియాన్లీ వూ అన్నారు. వాస్తవంలో ఫ్లేవనాయిడ్లు పెరుగుతూ ఉండకపోవచ్చు. కానీ మైక్రోవేవ్‌లో వండడంవలన ఫ్లేవనాయిడ్లను కొలవగలిగే అవకాశం ఎక్కువ. అందువల్ల మైక్రోవేవ్ కుకింగ్‌లో ఫ్లేవనాయిడ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని వూ తెలిపారు.

“మైక్రోవేవ్ కుకింగ్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కూరగాయలన్నిటినీ ఒకే గాటన కట్టలేం. ఒక్కో జాతికి ఒక్కోరకమైన ఆకృతి, నిర్మాణం ఉంటాయి. పోషక విలువల్లో భేదం ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే చాలా రకాలైన కూరగాయలకు మైక్రోవేవ్‌లో కుకింగ్ మేలైన పద్ధతి. అయితే, అన్ని కూరగాయలకూ ఇది వర్తించకపోవచ్చు” అని వూ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here