తిరుమలలో మరోసారి సిఫారసుల స్కాం బయటపడింది. ఈసారి విషయం ఇంకా షాకింగ్. ఏకంగా రాష్ట్ర మంత్రి పేరుతో నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి, ప్రత్యేక దర్శన టికెట్లు మంజూరు చేయించుకునేందుకు దొంగలు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ టీం వేగంగా స్పందించి పూర్తి వివరాలు వెల్లడించింది.
తిరుమలలో ప్రత్యేక దర్శన టికెట్లు, వీఐపీ పాస్‌లు పొందేందుకు కొంతమంది వ్యక్తులు రాష్ట్రంలో ఒక కీలక మంత్రికి చెందిన లెటర్‌హెడ్‌ను నకిలీగా తయారు చేసి, దర్శన టికెట్లు ఇవ్వాలని కోరుతూ టీటీడీ అధికారులకు పంపారు. అనుమానం వచ్చిన టీటీడీ అధికారులు వెంటనే ఆ సిఫారసు పత్రాన్ని చెక్ చేయగా అది పూర్తిగా నకిలీ అని తేలింది.

“మా కార్యాలయం నుంచి ఎలాంటి సిఫారసులు పంపలేదు, మా లెటర్‌హెడ్‌ను ఎవరో దుర్వినియోగం చేశారు” సంబంధిత మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో వ్యవహారం మరింత సీరియస్ అయ్యింది.
భక్తుల కోసం ఏర్పాటు చేసిన దర్శన వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయలేరు, నకిలీ సిఫారసులు పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే సైబర్ క్రైమ్, పోలీసులు కలిసి దర్యాప్తు ప్రారంభించారు అని తెలిపారు.
నకిలీ సిఫారసులు పంపితే క్షమించేది లేదు, నేరపూరిత చర్యలు తప్పవు అని టీటీడీ హెచ్చరిక కూడా ఇచ్చింది.
తిరుమల దర్శనం కోసం సిఫారసుల పేరుతో అనేక స్కాములు జరిగిన నేపథ్యంలో ఈ ఘటన భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. దర్శన టికెట్ కోసం ప్రజలు పడే కష్టాన్ని దొంగలు ఉపయోగించుకుంటున్నారని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో మళ్లీ నకిలీ సిఫారసుల ఘటన బయటపడటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులు కూడా అధికారిక ఛానల్స్ మినహా ఎక్కడా నమ్మకం వుంచవద్దని సూచించింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది, త్వరలో నిజాలు బయటపడే అవకాశం ఉంది.
