మాస్ మహారాజా రవితేజ నుంచి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాతో అయినా రవితేజకి గట్టి కమ్‌బ్యాక్ దక్కిందా? ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? ఇప్పుడు పూర్తి రివ్యూ చూద్దాం.

కథ:
సగటు భర్త చుట్టూ తిరిగే కథే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. పెళ్లైన తర్వాత ఒక బిజినెస్ విషయం పై స్పెయిన్ కి వెళ్లిన రామ్ (రవితేజ) అక్కడ మానస శెట్టి తో తొందరపడతాడు. ఆ తర్వాత తన భార్య భామ కి ఆ విషయం తెలియకుండా ఉండడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే సినిమా కథ.
నటన:
రవితేజ ఈ చిత్రంలో తనకు అలవాటైన ఎనర్జీతో కనిపించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్‌లో రవితేజ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మాస్ యాక్షన్‌కు దూరంగా, ఫ్యామిలీ టోన్‌లో కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతినిచ్చే అంశం.
హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఆషిక రంగనాథ్ నటన సహజంగా ఉండటంతో పాటు, కథకు బలాన్ని చేకూర్చింది, తాను అందాలని కూడా బాగానే ఆరబోసింది ఈ సినిమాలో. సహాయ నటుల్లో సునీల్, వెన్నెల కిషోర్ కూడా తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు.
దర్శకత్వం & కథనం:
దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో కామెడీతో సరదాగా సాగుతూ వెళ్లిపోతాయి. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్టు అనిపించినా, క్లైమాక్స్ మాత్రం కొంచెం సిల్లీగా అనిపిస్తుంది.
సంగీతం & టెక్నికల్ అంశాలు:
సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు కథ ప్రవాహాన్ని ఆపకుండా సాగుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ సాధారణంగానే ఉన్నా, ఫ్యామిలీ డ్రామాకు సరిపోతుంది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ నుంచి మాస్ యాక్షన్ ఆశించే వారికి ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించవచ్చు. కానీ కుటుంబంతో కలిసి చూసే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది రవితేజకి భారీ కమ్‌బ్యాక్ అనలేము కానీ, ఆయన కెరీర్లో ఒక మంచి రిలీఫ్ ఫిల్మ్‌గా మాత్రం చెప్పొచ్చు.
