గత కొన్ని రోజులుగా దిల్లీలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత, మందులు దొరక్కపోవడం, వెంటిలేటర్ సహాయం అందకపోవడం, మరణాలు పెరగడంతో… పరిస్థితి భయానకంగా మారింది.
వాస్తవాలు తెలుసుకోవడానికి శనివారం నేను కారులో బయలుదేరి పలు ఆస్పత్రులు, బస్సులు, రైల్వే స్టేషన్లు పరిశీలించాను. రోడ్డు మీద వెళ్తుంటే అంబులెన్స్ మోత మోగిపోతోంది. నిర్విరామంగా రోడ్డుకు రెండువైపులా అంబులెన్సులు తిరుగుతూనే ఉన్నాయి. సుమారు రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో లాక్‌డౌన్ కారణంగా చాలావరకు దుకాణాలు మూసి ఉన్నాయి. రోడ్లపై కొన్ని కార్లు తప్ప పెద్దగా వాహనాలు లేవు. మొదట సోమవారం వరకే లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రకటించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం కర్ఫ్యూను మరో వారానికి పొడిగించినట్లు ప్రకటించారు.
ఆసపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిండుకుంటోంది. కరోనా రోగుల బంధువులు ఎలాగైనా ఆక్సిజన్ సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. తమ కుటుంబ సభ్యులను బతికించమని డాక్టర్లను ప్రాధేయపడుతున్నారు. ఆస్పత్రుల బయట “పడకలు అందుబాటులో లేవు” అని బోర్డులు తగిలిస్తున్నారు. రోగుల బంధుల ముఖాల్లో నిరాశ, నిస్సహాయత తాండవిస్తోంది. ఏదో ఒక ఆస్పత్రిలో తమ ఆత్మీయులకు పడక దొరక్కపోతుందా అనే ఆశతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరి ద్వారా ఒకరికి, వాళ్ళ నుంచి మరొకరికి ఫోన్లు చేస్తూ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని, పడకలు సంపాదించాలని రోగుల స్నేహితులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ఈ సమయంలో స్నేహితులు, బంధువులే తమ ఆత్మీయులను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. డబ్బున్నవాళ్లు, పేదవాళ్లు, హిందువులు, ముస్లింలు అనే భేదాలన్నీపోయాయి. అందరి లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా కరోనా రోగులను కాపాడాలి. వారికి చికిత్స అందించి బతికించుకోవాలి.
మొట్టమొదట నేను ఎయిమ్స్‌కు వెళ్లాను. ఇది దిల్లీలో చాలా పెద్ద, విశాలమైన ఆస్పత్రి. దేశవ్యాప్తంగా ప్రజలు చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ కరోనాకు మంచి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరం నా సోదరుడికి కరోనా సోకినప్పుడు 12 రోజులపాటూ ఇక్కడే చికిత్స అందించారు. నా సోదరుడిని చేరుస్తున్నప్పుడు ఆయన బతికే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉన్నాయని ఆస్పత్రి డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కానీ, రెండు వారాల తరువాత నా సోదరుడు పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చారు. శనివారం ఎయిమ్స్ ముందు వందలకొద్దీ జనం గుమికూడి ఉన్నారు. కొంతమంది పక్కనే ఫుట్‌పాత్ పైనే దుప్పట్లు పరుచుకుని కూర్చున్నారు. అక్కడే వంటలు చేసుకుని తింటున్నారు. వీరిలో అనేకమంది ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినట్లుగా కనిపించారు.