ఒక సీటీ స్కాన్‌… 400 ఎక్స్‌రేలు తీసుకున్నంత ప్రమాదం: ప్రెస్ రివ్యూ

కరోనా రోగులు సీటీ స్కాన్ చేయించుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వెంటనే సీటీ స్కాన్‌ తీయించుకోవడం మంచిది కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఒక సీటీ స్కాన్‌ 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానమని, దానివల్ల భవిష్యత్తులో కేన్సర్‌ ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలున్నవారు దాని జోలికి పోవద్దని ఆయన సూచించారని ఈనాడు రాసింది. ఆయన సోమవారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసలు కరోనా లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారు సీటీ తీయించుకుంటే లోపల మరకలు (ప్యాచెస్‌) వస్తాయి. తేలికపాటి లక్షణాలు ఎలాంటి చికిత్స లేకుండానే వాటంతట అవే పోతాయి. ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగానే ఉండి, తేలికపాటి లక్షణాలతో ఇంట్లోనే ఏకాంతంలో కొనసాగుతున్నవారు సీటీ చేయించుకోవాల్సిన అవసరమేలేదు.

యువత ఎక్కువ సీటీ స్కాన్‌ చేయించుకుంటే తర్వాతి దశలో కేన్సర్‌ ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. మధ్యస్థాయి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేటప్పుడు మాత్రమే సీటీ స్కాన్‌ చేయించుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే తొలుత ఛాతీకి ఎక్స్‌రే తీయించుకున్న తర్వాతే సీటీస్కాన్‌కు వెళ్లాలి. బయో మార్కర్స్‌ రక్త పరీక్షల జోలికి కూడా పోవద్దు. కొందరు ప్రతి మూడురోజులకు ఒకసారి స్కాన్‌ చేయించుకుంటున్నారు. అలాంటి వారికి భవిష్యత్తులో కేన్సర్‌ ముప్పు అధికం. తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి చాలా వరకు ఎలాంటి మందులు అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తీసుకోవచ్చు. అంతకుమించి అవసరం లేదు. ఆసుపత్రుల్లో కొందరు రోగులు ప్రాథమిక దశల్లోనే స్టిరాయిడ్స్‌ తీసుకుంటున్నారు. అలా చేస్తే వైరస్‌కు బలం చేకూరుతుంది. అధికమందుల వినియోగం (ఓవర్‌ ట్రీట్‌మెంట్‌) వల్ల నష్టం కలుగుతుందని ఆయన చెప్పారని ఈనాడు వివరించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు