ముంబయిలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి 20 మంది మృతి

ముంబయిలోని చెంబూరు భారత్‌ నగర్ ప్రాంతంలో చెట్టు విరిగిపడి గోడ కూలిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. గాయపడిన వారిని రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శిథిలాల నుంచి ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికి తీశామని జాతీయ విపత్తు నిర్వహణ దళం ఇన్‌స్పెక్టర్ రాహుల్ రఘువన్ష్ తెలిపారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశముందని వివరించారు.

ఇక, విఖ్రోలీలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పంచశీల్ చాల్ ప్రాంతంలోని సూర్యనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. చెంబూరు శిథిలాల నుంచి 16 మందిని కాపాడినట్లు ముంబయి అగ్నిమాపక అధికారులు చెప్పారు.

శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరంలో చాలా చోట్ల వరదలు ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఖండీవాలీలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలైన కింగ్స్ సర్కిల్, లాల్ బాగ్‌లలో నీళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. కుంభవృష్ఠి కారణంగా సియాన్ రైల్వే లైన్ కూడా నీట మునిగింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు