2016లోశాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహశకలాన్ని కనిపెట్టారు. కామో’ ఓవాలెవా అనే ఈ గ్రహశకలం పుట్టుక రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందన్న విషయం తప్ప ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇతర వివరాలేమీ తెలియవు. అయితే, ఇటీవల జరిగిన ఒక పరిశోధన దీని పుట్టుక గురించి కొన్ని ఆధారాలను తెలియజేస్తోంది. ఇది చంద్రుని నుంచి ఊడిపడిన భాగం కావచ్చని అంటున్నారు. “ఇది సాధారణ గ్రహ శకలం అయితే కాదు.. మేం ఊహించినట్లుగా కనిపించడం లేదు” అని అరిజోనా యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రజ్ఞుడు బెంజమిన్ షార్కీ అన్నారు. ఆయన అధ్యయనం నేచర్ పత్రికలో ప్రచురితమయింది.
“చంద్రుడు, ఉల్క ఢీకొనడం వల్ల చంద్రుని నుంచి ఈ భాగం విడిపోయి ఉంటుందని, బెంజమిన్ సహ అధ్యయనకర్త వుయాన్ శాంచెజ్ అన్నారు. ఇది చంద్రుని ఉపరితలం నుంచి విడిపోయి రాలి ఉండవచ్చు.” అయితే, కామో’ ఓవాలెవా స్వభావం గురించి తెలుసుకోవాలంటే మాత్రం శాంపిళ్ళను సేకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ దశాబ్దంలో ఎప్పుడైనా అది జరగవచ్చు. శాంచెజ్ చెబుతున్న సిద్ధాంతం నిజమే కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ, కామో’ ఓవాలెవా ఎలా ఉంటుంది?
కామో’ ఓవాలెవా ను 2016లో మొదటిసారి హవాయిలో ఉన్న పాన్ స్టార్స్1 టెలీస్కోప్ సహాయంతో కనిపెట్టారు. దీనిని గతంలో 2016 హెచ్ ఓ3 అని పిలిచేవారు. దీనికి శాస్త్రవేత్తలు హవాయియన్ అనే పేరు పెట్టారు. ఇది సుమారు 40 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిని చంద్రుడు అనడం కంటే, పాక్షిక ఉపగ్రహంగా పరిగణించవచ్చు.
“భూమికున్న పాక్షిక ఉపగ్రహం భూమితో పాటూ సహ కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమికి దగ్గరగా ఉంటుంది” అని శాంచెజ్ వివరించారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే, కామో’ ఓవాలెవా సూర్యుని చుట్టూ సమాంతర మార్గంలో తిరుగుతుంది. ఒకవేళ భూమి అంతమైపోయినా ఈ రాయి మాత్రం ప్రస్తుతం ఉన్న కక్ష్యలో తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ 8 పాక్షిక ఉపగ్రహాలను కనిపెట్టారు. వీటిలో కామో’ ఓవాలెవా మాత్రం అధ్యయనానికి అనువుగా ఉంది.
“మిగిలిన పాక్షిక ఉపగ్రహాల కంటే దీనిని అధ్యయనం చేయడం సులభం. సంవత్సరానికొక్కసారి ఏప్రిల్ నెలలో ఈ శకలం కాంతివంతంగా తయారవుతుంది. ఆ సమయంలో భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా దానిని గమనించవచ్చు” అని శాంచెజ్ చెప్పారు. మిగిలిన ఉపగ్రహాలు కనిపించవు. దాంతో, వాటిని విశ్లేషించడం సాధ్యం కాదు.