ఒక సాధారణ వైరస్ మనందరి జీవితాలను ఒక్క కుదుపుతో ఆపేసింది.
చరిత్రలో ఎన్నో రకాల వైరస్‌లు మానవ జీవితాన్ని ప్రభావితం చేశాయి. కొన్ని మహమ్మారిగా మారి ప్రాణాలు తీశాయి. అయినా సరే, ప్రపంచం ఎప్పుడూ ఇలా స్తంభించిపోలేదు. కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందినప్పుడు కానీ, సీజన్ మారుతున్నప్పుడు విజృంభించే ఫ్లూ జ్వరాల వల్ల కానీ ఇలా ఎన్నడూ జీవితం నిలిచిపోలేదు. మరి, కరోనావైరస్ మాత్రమే ఎందుకీ పని చేసింది? మన జీవితాలకు ఇంత ముప్పు తెచ్చి పెట్టిన ఈ వైరస్ సంగతేమిటి?
జిత్తులమారి కరోనావైరస్
ఇన్‌ఫెక్షన్ సోకిన ప్రారంభ దశలో వైరస్ శరీరాన్ని మోసపుచ్చగలదు. కరోనావైరస్ మన ఊపిరితిత్తులను, గాలి మార్గాలను కబళించేసి ఉంటుంది కానీ మన రోగ నిరోధక వ్యవస్థ ‘ఫరవాలేదులే’ అనుకుంటుంది. “ఈ వైరస్ మహా మోసకారి. ముక్కు లోపల వైరస్ ఫ్యాక్టరీ పెట్టేసి ఉంటుంది కానీ బయటపడదు. మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాం అనే భ్రమలు కలిగిస్తుంది” అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ లెహ్నెర్ తెలిపారు. సాధారణంగా ఏదైనా వైరస్ మన శరీరంలోని కణాలను హైజాక్ చేయగానే అవి ‘ఇంటర్‌ఫెర్నోస్’ అనే రసాయనాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. ఇలా చేస్తూ మిగతా శరీరానికి, రోగనిరోధక వ్యవస్థకు ప్రమాద సంకేతాలను పంపిస్తాయి.
“అయితే, కరోనావైరస్‌కు ఈ రసాయనాలు విడుదల కాకుండా ఆపగలిగే శక్తి ఉంది. దీనివలన శరీరానికి వైరస్ సోకినట్టు రోగ నిరోధక వ్యవస్థ గుర్తించదు.”
“కోవిడ్ సోకిన కణాలను ప్రయోగశాలలో పరీక్షిస్తే వాటికి వైరస్ సోకిందో లేదో కనిపెట్టలేం. కానీ కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధరణ అవుతుంది. కరోనావైరస్ చేసే కుయుక్తుల్లో ఇదీ ఒకటి” అని ప్రొఫెసర్ లెహ్నెర్ తెలిపారు.
‘హిట్ అండ్ రన్’ రకం వైరస్
మనం అనారోగ్యానికి గురికావడానికి ఒకరోజు ముందు వైరస్ గరిష్ఠ స్థాయిలో విజృభించడం ప్రారంభమవుతుంది. అయితే, ఆస్పత్రిలో చికిత్స తీసుకోవలసిన స్థాయికి చేరడానికి ఒక వారం రోజులు పడుతుంది. “బాగానే ఉంది కదా అని మనం మంచం మీద పడుకోకుండా బయట హాయిగా తిరుగుతాం. ఇదే అదనుగా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. మనం కోవిడ్ నుంచీ కోలుకునే లోపలే మరొకరికి వైరస్ సంక్రమించేస్తుంది.”
“సూటిగా చెప్పాలంటే నువ్వు బతికున్నావో లేదో వైరస్‌కు అనవసరం. అది పట్టించుకోదు. హిట్ అండ్ రన్ కేసులాగ ఢీకొట్టి పారిపోవడమే” అని ప్రొఫెసర్ లెహ్నెర్ వివరించారు.
ఈ ప్రవర్తన, దీని మాతృ వైరస్ అయిన సార్స్-కరోనావైరస్ కన్నా చాలా భిన్నమైనది. 2002లో సార్స్ వైరస్ విజృంభించింది. కానీ ఈ వైరస్ సోకిన వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు. రోగులను గుర్తించి వేరు చేయడం సులభమైంది. ఇది కొత్తది, దీన్ని ఎదుర్కోవడానికి మన శరీరాలు ఇంకా సన్నద్ధమవ్వలేదు 2009లో వ్యాపించిన స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) బాగా భయపెట్టింది. అయితే, అది ఊహించినంత ప్రమాదకరం కాలేదు. దాని లక్షణాలు గతంలో వ్యాపించిన వైరస్‌లతో పోలి ఉండడం వలన, వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన శరీరంలో కొంత రక్షణ వ్యవస్థ ఏర్పడి ఉంది. మనుషులకు సోకే కరోనావైరస్‌లలో సాధారణ జలుబుతో మొదలయ్యే మరో నాలుగు రకాలు కూడా ఉన్నాయి.
“అయితే, ప్రస్తుత కోవిడ్ 19 వీటన్నిటికన్నా భిన్నమైనది. కొత్తది. దీన్ని ఎదుర్కోవడానికి కావలసిన రోగనిరోధక వ్యవస్థ మనకు ఉందని నేననుకోను” అని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన ట్రాసీ హసెల్ తెలిపారు. సార్స్-కోవ్-2 (కోవిడ్ 19) కొత్తదనం మానవ రోగనిరోధక వ్యవస్థకు ఒక షాక్‌లాగ తగిలుండొచ్చు. గతంలో యూరప్‌లో స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాపించినప్పుడు కూడా ఇలాగే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అప్పటికి అది కొత్త వైరస్. ప్రస్తుత పరిస్థితిని మశూచి వ్యాపించిన నాటి పరిస్థితితో పోల్చవచ్చు.
ఒక వైరస్‌ను ఎదుర్కోవడానికి మళ్లీ మొదటి నుంచీ రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేసుకోవడం వృద్ధులకు కష్టమవుతుంది. వయసు పైబడినవారిలో అప్పటికే రోగ నిరోధక శక్తి మందగించి ఉంటుంది. ఒక కొత్త ఇన్‌ఫెక్షన్‌తో పోరాడాలంటే శరీరంలోని రోగనిరోధక శక్తి ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ, వయసు పైబడిన వాళ్లల్లో రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన భాగమైన టీ-కణాల వైవిధ్యం తక్కువగా ఉంటుంది. కరోనావైరస్‌లాంటి కొత్త వైరస్‌ను ఎదుర్కోగలిగే కణాలను గుర్తించడం రోగనిరోధక వ్యవస్థకు మరింత కష్టమవుతుంది.