Green tea hair pack:సాంకేతిక రంగం శరవేగంగా పరుగులు పెడుతున్న ఈ కాలంలో వాతావరణ కాలుష్యం మనిషిని అనేక రకాల వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. మారుతున్న జీవనశైలి వల్ల అనేక రకాల రోగాలతో సగటు మనిషి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. వాతావరణ కాలుష్యంతో ఎక్కువగా చర్మ సంబంధ వ్యాదులతో పాటు.. జుట్టు పొడిబారడం, వేగంగా ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి గ్రీన్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ వాడడం వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు సులువుగా పరిష్కారం కనుగొనవచ్చు.

జుట్టు పొడిబారడం వల్ల శిరోజాలు పలచబడడమే కాకుండా జుట్టు త్వరగా ఊడిపోతుంది. హెయిర్ కేర్ కోసం మార్కెట్లో రకరకాల ఆయిల్స్, లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని వాడడం అంత మంచిది కాదు. జుట్టు ఆరోగ్యమేమో కాని ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జుట్టు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇంట్లోనే సహజసిద్ధమైన గ్రీన్ టీ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
గ్రీన్ టీ హెయిర్ ప్యాక్ తయారీ విధానం
కావలసిన పదార్థాలు
- గ్రీన్ టీ పొడి
- కోడి గుడ్డు పచ్చసొన
- అర టీస్పూన్ ఆవపిండి
తయారీ విధానం
మొదట గ్రీన్ టీ పొడిని గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కోడిగుడ్డు పచ్చసొన, అర టీస్పూన్ ఆవపిండి వేసి బాగా కలపాలి. ఇలా వచ్చిన మిశ్రమంలో కొంచెం గ్రీన్ టీ డికాక్షన్ వేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
ఇలా తయారైన పేస్టుని జుట్టుకి రాసుకుని 15 నిమిషాల తర్వాత కుంకుడు కాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు లేదా, మూడు సార్లు చేస్తే మీ జుట్టు నాజూగ్గా, ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకు..
గ్రీన్ టీలో B విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.
మూడు కప్పుల నీటిలో రెండు టీ స్పూన్ల గ్రీన్ టీ పొడిని వేసి పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తలస్నానం చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న గ్రీన్ టీ నీళ్లని జుట్టు కుదుళ్లకు రాసుకుని చేతి వేలితో గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోండి.
ఒత్తైన జుట్టు కోసం..
గ్రీన్ టీలో EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని అనేక రకాల పరిశోదనలలో తేలింది.
కావలసిన పదార్థాలు
- కొబ్బరినూనె
- గ్రీన్ టీ పొడి
తయారీ విధానం
ఒక బౌల్ లో మీ జుట్టుకు సరిపడా కొబ్బరినూనె తీసుకోండి. నూనెకు తగినంత గ్రీన్ టీ పొడిని వేసి బాగా కలిపి పాక్ లాగా చేసుకోండి. ఇప్పుడు వచ్చిన పేస్టును తలకి అప్లై చేయండి. అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తుంటే మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తుగా పెరుగుతాయి.
కాంతివంతమైన చర్మం కోసం..
గ్రీన్ టీ జుట్టునే కాకుండా చర్మ సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచి హానికర బ్యాక్టీరియాను బయటికి పంపి శుభ్రంగా ఉండేలా చేస్తుంది. అలాగే మొటిమల వల్ల ముఖంపై ఏర్పడ్డ మచ్చలను తగ్గిస్తుంది.
కావలసిన పదార్థాలు
- గ్రీన్ టీ
- తేనె
- నిమ్మరసం
గ్రీన్ టీ బాగ్ ను కత్తిరించి ఒక గిన్నెలోకి తీయండి. అందులో 2 టీస్పూన్ల తేనెను కలపండి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం కలిపి మెత్తని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ఇవి కూడా చదవండి
- Rice water benefits: బియ్యం నీటితో హెయిర్ కేర్
- Hibiscus For Hair Growth: మందారంతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు
- Neem Tree Health Benefits: వేప ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Aloe Vera Benefits: కలబంద ఆరోగ్య ప్రయోజనాలు