తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య రిలేషన్‌షిప్ గురించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయం లో వీరిద్దరూ కలిసి నటించిన సినిమా “ఓం శాంతి శాంతి శాంతిః” పై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.

గోదావరి జిల్లా నేపథ్యంతో సాగే ఈ కథలో ఓంకార్ నాయుడు ఒక చేపల వ్యాపారి. సంప్రదాయ భావజాలంతో, “మగాడు అంటే ఇలానే ఉండాలి” అనే బలమైన నమ్మకంతో జీవించే ఓంకార్, చదువు మీద ఆసక్తి తో ఉన్న ప్రశాంతి ని వివాహం చేసుకుంటాడు.
వివాహానంతరం ఓంకార్ చేసే శారీరక, మానసిక వేధింపులను ప్రశాంతి మొదట తేలిగ్గా తీసుకుంటుంది. కానీ అది ఒక్కసారి జరిగిన ఘటన కాదని, అతని ప్రవర్తనలో భాగమని గ్రహించిన తర్వాత ఆమె తిరగబడుతుంది.
పరిస్థితులు తారుమారు కావడంతో ఓంకార్ క్షమాపణ చెప్పి మారినట్టు నటిస్తాడు. ఈ క్రమంలో ప్రశాంతి గర్భవతి అవుతుంది. అప్పుడే ఓంకార్ అసలు ఉద్దేశం బయటపడుతుంది. ఆ తర్వాత ప్రశాంతి తీసుకునే నిర్ణయాలే సినిమా మిగతా కథ.
ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఈషా రెబ్బా నటన. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా, అలాగే భర్తకు ఎదురుతిరిగే ధైర్యవంతురాలైన మహిళగా ఆమె పాత్ర రెండు షేడ్స్‌లో బాగా ఒదిగిపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆమె నటన సినిమాకు బలంగా నిలుస్తుంది.
తరుణ్ భాస్కర్ ఓంకార్ నాయుడు పాత్రలో జీవించినట్టుగా కనిపిస్తాడు. గోదావరి యాసను కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇక మిగతా నటుల్లో బ్రహ్మాజీ హాస్యభరిత పాత్రతో మెప్పిస్తే, తల్లిగా సురభి ప్రభావతి కూడా మంచిగా నటించారు.
సినిమాటోగ్రఫీ గోదావరి ప్రాంత సౌందర్యాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి కానీ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోయేలా ఏమి లేవు.
