ప్రముఖ జ్యోత్యిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు ఆదివారం (23-01-2022) అకాలంగా కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య రావటంతో కుటుంబ సభ్యులు పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించడం జరిగింది.

టీవీ మాధ్యమం ద్వారా రాశి ఫలాలు చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువైన విషయం తెలిసిందే.
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాల్లో, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతీమాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు.
ప్రతి సంవత్సరం ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అందించే పంచాంగ రాశి ఫలితాలు ములుగు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు అందిస్తూ వచ్చారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల హిందూ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.